హక తో మళ్లీ దద్దరిల్లిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ పార్లమెంటు

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన అతి పిన్న వయస్కురాలైన ఎంపీ హనా-రౌహితీ మైపీ-క్లార్క్(22) ప్రసంగం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో ఆమె పార్లమెంటులో ఆదివాసీ పాట 'మావోరీ హకా(యుద్ధానికి ముందు యోధులను ఉత్తేజపరిచే శ్లోకం)' పాడి వార్తల్లో నిలవగా..తాజాగా మళ్లీ అదే పార్లమెంటులో  హకా పాడుతూ డాన్స్ చేశారు. సహచర ఎంపీలు కూడా ఆమెకు మద్దతుగా స్టెప్పులు వేశారు.

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్.. మావోరి ఆదివాసీలకు ఉన్న ప్రత్యేక హక్కులను కాలరాసేందుకు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి న్యూజిలాండ్ పార్లమెంటులో ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లును  ప్రవేశ పెట్టారు. ఆ బిల్లు ప్రవేశ పెట్టిన తరువాత పార్లమెంటులో ఎంపీలందరూ ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.

ఇదే సమయంలో ఎంపీ హనా-రౌహితీ  లేచి, బిల్లు కాపీని కోపంతో చించేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'హక' ప్రదర్శనతో నిరసన తెలిపారు. మరికొందరు ఎంపీలు కూడా  బిల్లును వ్యతిరేకిస్తూ ఆమెతో పాటు'హక' డాన్స్ చేశారు. హనా-రౌహితీ చేసిన 'హక' డ్యాన్స్  ఇప్పుడు మరోసారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.